చెవులువిప్పి మనసు విప్పి
కనులువిచ్చి వినవయ్యా
కేథలిక్కు కెన్నెడీ
బోల్షివిక్కు మున్నుడి
అరుపులిచ్చి కరువు తెచ్చి
ఋణంపెట్టి రణం తెచ్చి
జనంధనం ఇంధనమై
చరణకరాబంధనమై
జనన జరా మరణదురా
శ్రమణల సంగ్రంథనమై
ఒకనాడోహో అని పిం
చుకతిరిగిన ధనిక వాద
మికపైవెగటై జిగటై
మరణంలో మశౌతుంది
వినవయ్యాకెన్నడీ
విశాలంధ్రమున్నుడి
కేథలిక్కుకెన్నెడీ
జీవితమేనిన్నది
భావములేమొన్నవి
క్యూబా ఏమన్నది
లావోస్ ఏమన్నది
కాంగో నిలుచున్నది
ఐసన్ హోవర్ చేసిన
మోసంతాలూకు అసలు
వేసం ఈనాడు
ఎగిరివచ్చి నిజంపైకి
లెక్కి వచ్చిజనం తిరుగు
బాటుకేసి ఆకలేసి
పిడికెడు కబళంకావా
లని యడిగిన తరుణంలో
లుముంబానుతిన్నావు
కుటుంబాలుకొన్నావు
అమెరికాల కాలు విరిగె
ఆఫ్రికాకు నోరు తిరిగె
ఆసియాకు ఆశరగిలె
ఆస్ట్రో ఆఫ్రో ఏష్యన్
కాస్ట్రోలకు కనులువిరిసె
ఏమంటావ్ కెన్నడీ
ఈ శ్రీశ్రీ సన్నిధి
చంపేస్తాననినీకో
సందేహం ఉండవచ్చు
సర్దేస్తాననినీకో
సమాధానముండవచ్చు
నీ టాంకులు నీ బాంబులు
విమానాలు విధానాలు
శ్మశానాలు చూస్తాయి
ప్రశాంతినే హరిస్తాయి
నీసలహాదారులతో
నీకలహాచారులతో
పెంట గనుల తుంటరులను
వెంటబెట్టుకునివస్తే
రాకెట్లనువిప్పుతాం
నీకట్లను విప్పుతాం
జాకెట్లను సవరించి
పాకెట్లను సరిదిద్ది
నీమతాన్నే నీ హితాన్ని
నీగతాన్ని కెలుకుతాం
చీకట్లనుతరుముతాం
నీ హిట్లరు పాతదనం
చావాలని కసరుతాం
విన్నావాకెన్నడీ
శ్రీ శ్రీశ్రీ మున్నిడి