బాకాలు's image
0474

బాకాలు

ShareBookmarks

బాకాలు లాభం లేదు బాజాలు లాభంలేదు
ఎంత ఈదినా ఏం ఫాయిదా ఎక్కడా తీరం కనపడదు
తల మాత్రం మీదికుంచి నిలువీత ఈదుతున్నాం
గమనం పిసరూ లేదు గమ్యం అసలే లేదు
పట్టాభిరావ సామ్మీద ప్రమాణంచేసి చెబుతున్నా
అంతా గజీతగాళ్ళే మళ్ళీ అరగంట పురోగమనం లేదు
ఆదర్శప్రాయంగా అభినయిస్తున్నాం అయినా ఎవరూ మనల్ని చూడ్రు
అరుస్తున్నాం గొంతు చించుకుని అయినా ఎవరూ విన్రు

మనలో కొంతమంది కవులు మధురంగా విశసిస్తారు
యతిప్రాసలు సరిపోతాయి పదాలు మజాగా పడతాయి
పౌరుషానికి లోటులేదు ప్రశస్తికి కూడా డిటో
పద్యాలకు పళ్ళు రాలవు చింతకాయలు చెట్టు మీదే వున్నాయి

ఈ గొంగళీ వయస్సు ఇరవై అయిదేళ్ళు
ఇంకా ఎక్కువే అనుకో ఎవడు చూశాడు లెక్కలు
తీర్మానాలూ ఉపవాసాలూ చేశాం ఖద్దరూ కేకలూ వేశాం
మొసుకొచ్చాం సరాజ్యమ్మూట మూట విప్పితే ఏమీలేదు

అరవిందఘోస్టు ఆశీరదించాడు కదా
ముమ్మిడివరం బాలయోగి ఏమంటాడో
ఆంజనేయదండకం వల్లిస్తేనో
అన్నట్టు సాయిబాబాకి మొక్కుకోకూడదూ

మహారణ్యంలో మధ్యాహ్నంలాగ ఒక స్తబ్దత నిశ్శబ్దత
రాత్రిపూట వేట ముగించుకొని కౄరమృగాలు నిద్రిస్తున్నాయి
చిల్లరజంతువులు భయంతో ఎక్కడివక్కడ ఇరుక్కుపోయాయి
ఎప్పుడైనా ఒక పక్షి ఎగిరితే ఎక్కడో ఒక ఆకురాలి చప్పుడు

శిశువుకి దక్కని స్తన్యంలాగ ప్రవహిస్తున్నాయి గోదావరి నీళ్ళు
బద్దలైన గుండెల్లాగా బీటలు వేశాయి పొలాలు
మన పరిశ్రమలు ప్రణాళికల్లోనే మన ప్రతిభ చాకిరీకి తాకట్టు
మనకో ఇల్లంటూ లేదు రచ్చకెక్కి రాద్దాంతాలు

కొంగల్లారా జపం చెయ్యండి పిల్లీ పఠించు మంత్రాలు
ఎలకల్లారా సభ జరపండి ఎవరు గంటకట్టాలని
ఇంకోమారు ఎగరవేనక్కా ఈ సారి అందవచ్చు ద్రాక్షపళ్ళు
కోతీ తీసుకురా త్రాసు పంపకం తెగడం లేదు.

Read More! Learn More!

Sootradhar