ఆకాశదీపం's image
0265

ఆకాశదీపం

ShareBookmarks

ఆకాశదీపం
గదిలో ఎవరూ లేరు,
గదినిండా నిశ్శబ్దం.
సాయంత్రం ఆరున్నర,
గది లోపల చినుకుల వలె చీకట్లు.
ఖండపరశుగళ కపాలగణముల
చూస్తున్నది గది.
కనుకొలకులలో ఒకటివలె
చూపు లేని చూపులతో తేరి.
గదిలోపల ఏవేవో ఆవిరులు.
దూరాన నింగిమీద తోచిన ఒక చుక్క
మిణుకు చూపులు మెలమెల్లగా విసిరి
గదిని తలపోతతో కౌగిలించుకొంటున్నది.
ఒక దురదృష్టజీవి
ఉదయం ఆరున్నరకు
ఆ గదిలోనే ఆరిపోయాడు.
అతని దీపం ఆ గదిలో
మూలనక్కి మూలుగుతున్నది.
ప్రమిదలో చమురు త్రాగుతూ
పలు దిక్కులు చూస్తున్నది.
చీకటి బోనులో
సింహములా నిలుచున్నది.
కత్తిగంటు మీద
నెత్తుటి బొట్టులాగున్నది.
ప్రమిదలో నిలిచి
పలు దిక్కులు చూస్తున్నది దీపం.
అకస్మాత్తుగా ఆ దీపం
ఆకాశతారను చూసింది.
రాకాసి కేకలు వేసింది.
(నీకూ నాకూ చెవుల సోకని కేకలు)
ఆకాశతార ఆదరపు చూపులు చాపింది.
అలిసిపోయింది పాపం, దీపం.
ఆకాశతార ఆహ్వానగానం చేసింది.
దీపం ఆరిపోయింది.
తారగా మారిపోయింది.

 

Read More! Learn More!

Sootradhar