అధివాస్తవికుల ప్రవేశం's image
3 min read

అధివాస్తవికుల ప్రవేశం

Sri SriSri Sri
0 Bookmarks 115 Reads0 Likes

అధివాస్తవికుల ప్రవేశం
కాసరమా వికారములు కార్చకు పూసరమా మసారపున్
రాసులలో కపాలములు రాల్చకు తావళమా విషాదపున్
వేసములో కుశాసనము పేర్చకు రాసభమా సమాధిలో
మీసము పెంచి మా తొడల మీద నటించకు పుణ్యమయ్యెడున్.

నిచ్చెన పచ్చి నెత్తురులు నింపి నిలింపుల దుంపత్రెంపి కా
ర్చిచ్చులు త్రచ్చుకొన్నది శచీపతి పీచుమిఠాయి వేటలో
పచ్చిక మచ్చికైనది క్షపాకర భీకర సూకరాకృతుల్
పిచ్చిదనాలుపోయిరి కబీరును త్రాగిన రోషనారులై.

ప్రాతది సూదికన్ను పొరపాటున తా తెరచాటు చేసి ఘో
షా తిలకించబోయి వెదజల్లును గుమ్మడి పూదుమారముల్
లేతది రావికొమ్మ పడలేదు భయానక దందశూక ని
ర్ఘాత పతాక దాని కొరకై యిరుకైనవి సందులెందుకో.

గంధముగా మెడన్ పులుమగా తలపోయదు వంధకారపున్
బంధకి యూర్చు జాలి (బల?)బాలను గాలము వేసి లాగుచున్
సింధువు పిల్చెనా పరిహసించెడు సైగల? సుప్తశోణ పా
ణింధమ ఖడ్గధార హవణించకుమీ తిలకాష్ఠ వహ్నిలోన్

మ్రింగి తిమింగలాంగల తమిస్రగుహాంతర మీనమేష పా
రంగతులైన బొంగరములార యెరింగిన తెల్పుడా పరి
ష్వంగము పాడుటెందుకు? విపంచికి కంచికి దూరమెంత? వ
డ్రంగుల రంగులా గులకరాళ్ళు(ను?) మా గుడిలోని లింగముల్?

ఉద్యమ నాయకా చదువుకో వినిపించని కంచుకాగడా
వాద్యములన్ నిశానిశిత వల్లరి అల్లరి యల్లికన్ సము
త్పాద్య సుధావృధావ్యధలు భాషకులొంగని భావశాకలో
చోద్యమ లూహలో మలుపు చూడ్కులు నీతలమున్క కాన్కలై

కైకొని కాకికన్ను కలకాలపు చూపులు రెక్క రిక్కపై
పైకొని మేకుతాకిడికి ప్రాణము హాయి బజారు జారుడై
డాకయికై కడాని పగడాల గుడారములో విడాకులై
రోకలి రోదనాకులత రోదసినిండిన రోగభోగమై

మౌనము శంఖమై చెరగుమాయగ నేత్రపతంగ బింబ ని
ధ్వానము కొంగనెత్తురులు త్రాగెడు నల్లతురాయి పూవుగా
వేనలిపై అవే అయిదువేల కుళీర కుఠార దారుణ
ప్రాణ శిలీంధ్రముల్ తిరుగుబాటు తుపాకి తుపాను కానుపుల్

వచ్చెడువాడు ఫల్గుణుడు వార్ధితరంగ మృదంగ ఘోషలో
విచ్చెడు మచ్చునుందు పలవించెడు కించి దుషస్తుషారముల్
పచ్చిక మచ్చికైనది ప్రపంచపు నెత్తురు మంటపాటలన్
మెచ్చనివాడ నీ మెడల మీద నివే ఉదయాద్రి రౌద్రముల్.

 

No posts

Comments

No posts

No posts

No posts

No posts