ఆమె దుఃఖించింది's image
NaN min

ఆమె దుఃఖించింది

పాపినేని శివశంకర్పాపినేని శివశంకర్
0 Bookmarks 28 Reads0 Likes

ఆమె దుఃఖించింది
అకారణంగా అనుమానించింది
అభిముఖం పెడమొహం అయిందని
తలపైన వలపు మబ్బు ఎక్కడికో తరలిపోయిందని
తాను కోరుకొన్నది తనను కోరుకోవటం లేదని
తనకు తనే
హృదయంలో శూలాన్ని దిగేసుకుంది
దిగులు నదిని ఈదలేక
మరో సూర్యోదయం చూడరాదనుకొని
వయసు మునిమాపున కోరుకోవాల్సిన ముగింపేదో
నట్టనడిజామునే కోరుకొంది
ఏ బరువులూ బాధ్యతలూ తీరకుండానే
తనకు తనే సున్నా చుట్టేసుకొంది

ఇక చాలు అతని గురించి ఎడతెగని తలపులు ప్రగాఢ చుంబనాలు భుజంపై తల వాల్చటాలు ఎంతకీ వదలని కౌగిళ్లు అన్నీ మరిచిపోయి తుదముట్టిన ఆశలా ఒక విస్మృతిలోకి జారిపోయింది గాలికి తూలిన సన్నజాజి తీగలా ఒక లోయ లోకి జారిపోయింది చివరి కన్నీటిచుక్కలా చిట్టచివరి ఊపిరిలా అలా –

అతడు తనువంతా అశ్రుకణమయ్యాడు
విలపించాడు విలవిల్లాడాడు
చిగురుటాకులా కంపించిపోయాడు
వేయి దేవుళ్లను వేడుకొన్నాడు
అదే ప్రేమతో అదే ఇష్టంతో
ఆమె చేతిని తాకాడు

దయ గల దేవతెవరో
ఆమె తల నిమిరి వెనక్కి పంపించింది
చూడరాదనుకొన్న మరో కొత్త సూర్యోదయాన్ని
చూసిందామె ప్రశాంతంగా
పైకి లేచిన హంస వెనక్కి మళ్లి
మనస్సరోవరాన వాలింది
తలపై మేఘాన్ని చూసింది ఆనందంగా
కాలు మోపిన ఆ కారుచీకటి గుయ్యారంతో
ఇక పనేమిటి?
హిమశీతల హస్తస్పర్శతో పనేమిటి?
కోరుకొన్న మనసు
మనసుతో పెనవేసుకొన్నప్పుడు
మృత్యువుతో పనేమిటి?

No posts

Comments

No posts

No posts

No posts

No posts