ఆగిపోని గానం's image
NaN min

ఆగిపోని గానం

ముకుంద రామారావుముకుంద రామారావు
0 Bookmarks 47 Reads0 Likes

కవిత్వం నాకొక దేవాలయం
నా శోధనలూ వేదనలన్నీ
నాకు తెలియకుండానే అక్కడ
గానమై విచ్చుకుంటాయి

నాకంటే ముందు నుండే ఎందరో అక్కడ
అసంఖ్యాక జీవిత స్వరాల్ని
అనంతంగా అద్భుతంగా పాడుతునే ఉన్నారు
అయినా ఎవరికీ తెలియకుండా
పాడాల్సినవి అగణ్యంగా
పెరిగిపోతూనే ఉన్నాయి

ఎన్నెన్ని బరువులో అందరివీ
అన్నీ ఒకే సంచిలో
మోసుకు తిరుగుతున్నారు
ఎవరి కన్నీళ్లు వారివే అయినా
కన్నీళ్లలో తేడాలేనట్టే
అందరినీ తాకుతున్న ఒకే బాధ

ప్రవాహంలో కొట్టుకుపోతున్నా
ఆకాశం అనంతాన్ని
సముద్రం వైశాల్యాన్ని
పాటల్లో ఇమడ్చాలని చూస్తున్నారు
జీవనస్పృహ కన్నీళ్లు వారి ప్రతీకలు

వింటున్నారా చూస్తున్నారా ఎవరైనా
అర్ధమవుతోందా ఎవరికైనా
తెలుసుకునేలోగా
మరో కవిత్వ కెరటమేదో
దాన్ని తుడిచిపెట్టుకుపోతుంది

ఆ దేవాలయం
ఖాళీగా ఎప్పుడూ ఉండదు
కొత్త వారు వస్తూనే ఉంటారు
సరికొత్త బాధల భావనాస్వరాలతో–
వారిని వారే కాదు
అంతకు ముందున్న వారినీ
అందులో లీనం చేస్తూనే ఉంటారు

No posts

Comments

No posts

No posts

No posts

No posts