నా సింధూర ప్రవాహ పదమ్ములు 

పరిభ్రమించి పరిస్రవిస్తే

ఒక జాతి నుదుటి తిలకమై 


నా తెలుగు లక్ష్మి గడపన పసుపునై 

సౌభాగ్యంతో నిత్య యవ్వన గీతికనై

నా విశ్వపు ప్రతీ అణువులో వినీలమై


కబళించే అణుధార్మిక శబ్దమై

ప్రవహించే కాలుష్యపు తేమనై

జ్వలించే కార్చిచ్చు అనలమై

తరిస్తాను....

తపిస్తాను....

భ్రమిస్తాను....

అనునిత్యం పరిభ్రమిస్తాను..


పురుషోత్తముడి జ్వలన వాక్కు

లేదన్నది ఒక జీవికి నిశ్చల శాంతి

నా గళం ఒక తరం దాచిన ఆవేదన

నా పదం రేపటి తరం కోరిన ఆస్వాదన

నా జీవం నిన్నటి తరం పంపిన ఉద్వాసన


ధార్మికతకి ఒక దశాబ్దం

కృతిమ రసాయనపు సంచికి ఒక శతాబ్దం

అలుపెరుగని మనిషికి మాత్రం 

కాల గమనం అనునిత్యం


ఒక పది కాగితాలు నింపని నేను

రెండు పదుల పుస్తకాలు చదవని నేను

మూడు పదుల కాలం గడపని నేను

నాలుగు పదుల సంపాదన చెయ్యని నేను

ఐదు పదుల జన సమూహంలో మాట్లాడలేని నేను

ఆరు పదుల రుచులు సృజించని నేను

ఏడు పదుల హరివిల్లును నిజ నేత్రంతో వీక్సించని నేను

ఎనిమిది పదుల దిక్కులను ఒక్క తనువుతో తాకలేని నేను

తొమ్మిది పదుల కాలం జీవించలేని నేను

పది పదుల ఆలోచనలని ఆపలేని నేను


నా హృదయ అంతర్భాగం నుండి ఉద్భవిస్తున్న

ఈ ఆలోచన ఆవేదన అశ్రువులని అక్షరాలుగా మార్చి

ఎప్పటికీ మారని ఈ లోకం కోసం

తనదైన శైలి లో మారుతున్నా కూడా ఓర్చలేని జనం కోసం


చూస్తున్న నువ్వు

రాస్తున్న నేను

అనునిత్యం అత్యద్భుతం.